ఇంకుడు గుంతల నిర్మాణం

29-12-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటాపురంలో నిర్మాణంలో ఉన్న ఇండ్ల వద్ద నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను గ్రూప్ సభ్యులు సందర్శించి పరిశీలించారు. శ్రీ కుమారి క్యాటరింగ్ అధినేత శ్రీ ధవళ మోహన్ గారు మరియు వారి ముగ్గురు అన్నదమ్ములు నిర్మిస్తున్న ఇండ్ల వద్ద ఫౌండేషన్ సూచన మేరకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం అభినందనీయమైన విషయం.

విశాఖ మహానగరంలో భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో వర్షపు నీటిని భూమిలోకి చొరబాటుచేసే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించడం అత్యంత అవసరం. గత నాలుగు సంవత్సరాలుగా జేడీ ఫౌండేషన్ కొత్తగా నిర్మాణం జరుగుతున్న ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.

ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు అక్కడి నిర్మాణ కార్మికులకు మరియు యజమానులకు ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించారు. వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాల నిల్వ పెరగడానికి ఇవి ఎంతో దోహదపడతాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు.

ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించిన దశల వారీ పనులను సభ్యులు పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. సరైన లోతు, వెడల్పు, నీరు సులభంగా ప్రవహించే విధానం వంటి అంశాలపై చర్చించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులై ముందడుగు వేసిన శ్రీ ధవళ మోహన్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు జేడీ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సమాజంలో చైతన్యం తీసుకురావడమే జేడీ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader