ఇంజనీరింగ్ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని మాజీ ఐపీఎస్ అధికారి, JD ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్, వేముల మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతన విద్యార్థుల కోసం నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు.
విద్యార్థి జీవితం భవిష్యత్తు పునాది వేయడానికి అత్యంత ముఖ్యమైన దశ అని, ఇంజనీరింగ్ విద్య కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా, విలువలతో కూడిన నాయకత్వ లక్షణాలను నేర్పుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి వినియోగించాలన్నారు.
శ్రీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ –
“సాంకేతిక రంగం వేగంగా మారుతోంది. ఈ మార్పులకు అనుగుణంగా మనం కూడా అభివృద్ధి చెందాలి. ప్రతి విద్యార్థి తనలోని ఆవిష్కరణాత్మక ఆలోచనలను వెలికితీసి సమాజానికి ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకోవాలి” అని పిలుపునిచ్చారు.

గౌరవ అతిథిగా హాజరైన జేఎన్టీయుహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ,
“ఇంజనీరింగ్ విద్యార్థులు సాంకేతిక జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మాత్రమే తమ భవిష్యత్తును నిర్మించగలరు. విద్య అంటే కేవలం పాఠ్యాంశాలు కాకుండా, వాటి ప్రయోగం కూడా ముఖ్యమైంది” అని అన్నారు.

కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సమాజంలో తమ పాత్రను అర్థం చేసుకుంటూ విద్యార్థులు చైతన్యవంతులుగా ఎదగాలని కళాశాల ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ వేముల మల్లారెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్లు సుబ్బరత్నం, రాఘవేందర్ రెడ్డి, భరతసింహా రెడ్డి, అధ్యాపకులు సత్యనారాయణ, మహేల్, డాక్టర్ విశ్వనాథన్, హెచ్ఓడీలు, తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమం చివరలో, విద్యార్థులు వీవీ లక్ష్మీనారాయణ గారిని తమ ప్రశ్నలతో ఉత్సాహంగా సంభాషించారు. ఆయన విద్యార్థులకు నూతన ఆవిష్కరణలు, స్వీయనిర్మాణం, మరియు దేశసేవ పట్ల ప్రేరణాత్మక సందేశం అందించారు.






