05-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో, జీవీఎంసీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం, బురుజుపేట ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచులను పంపిణీ చేయడం జరిగింది.
ఆలయానికి విచ్చేసే భక్తులు రోజూ నైవేద్యాలు, ప్రసాదాలు తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ సంచులను వినియోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వస్త్ర సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జేడీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు:
- సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించడం
- భక్తుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించడం
- వస్త్ర సంచుల వినియోగాన్ని ప్రోత్సహించడం
- ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం
- భవిష్యత్ తరాలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించడం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థానం వేద పండితులు ఏం. భీమ శంకర శాస్త్రి గారు మరియు వి. హనుమాన్ శర్మ గారు మాట్లాడుతూ, ప్లాస్టిక్ ఒక మహమ్మారిలా మారిందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కే. శ్రీనివాస శర్మ గారు, జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు, దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ గారు, అలాగే జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జేడీ ఫౌండేషన్ పర్యావరణ పరిరక్షణ, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగించనుంది.



