12-05-2026: జె.డి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ జె.డి. లక్ష్మీనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం వాసవీ జూనియర్ కళాశాల డైరెక్టర్ శ్రీ రమేష్ మాదారపు గారు విద్యార్థిని ఎస్. స్వాతికి హాస్టల్ వసతితో పాటు రెండు సంవత్సరాల పూర్తి ఉచిత ఇంటర్మీడియట్ విద్యను అందించారు.
గతంలో పదవ తరగతి చదువుతున్న సమయంలో జె.డి. ఫౌండేషన్ నుంచి సహాయం పొందిన స్వాతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఆమె తల్లి శ్రీమతి సునీత ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమెను, ఆమె తల్లిని వాసవీ జూనియర్ కళాశాలకు తీసుకెళ్లి క్యాంపస్‌ను సందర్శింపజేయగా, వారు కళాశాల వాతావరణంపై సంతృప్తి వ్యక్తం చేసి అడ్మిషన్‌కు అంగీకరించారు.
ఈ సందర్భంగా రెండు సంవత్సరాల ఉచిత ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన ఆఫర్ లెటర్‌ను జె.డి. ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా విద్యార్థిని స్వాతికి అందజేశారు. అదే కార్యక్రమంలో ఫౌండేషన్ సహకారంతో చదువుతున్న మరికొందరు విద్యార్థులకు కూడా గ్రాంట్ లెటర్లను అందజేశారు.
విద్యార్థిని స్వాతి మరియు ఆమె తల్లి శ్రీమతి సునీత, తమ విద్యాభ్యాసానికి అండగా నిలిచిన శ్రీ జె.డి. లక్ష్మీనారాయణ గారికి, శ్రీ రమేష్ మాదారపు గారికి, అలాగే జె.డి. ఫౌండేషన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్య ద్వారా పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో జె.డి. ఫౌండేషన్ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది.



