జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారి గృహం దర్శించిన జీవీఎంసీ అధికారులు

07-04-2026: ఈ రోజు 89వ వార్డు పర్యటనలో భాగంగా జీవీఎంసీ అధికారులు జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారి స్వగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అధికారులు పరిశీలించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీ నల్లనయ్య గారు, ఏఎంహెచ్‌ఓ శ్రీ కృష్ణంరాజు గారు, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. రామకృష్ణ గారు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సందర్శన సందర్భంగా శ్రీ రామకృష్ణ గారు తమ నివాసంలో అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను అధికారులకు వివరించారు. ముఖ్యంగా మిద్దె తోటలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను అధికారులు పరిశీలించి, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పచ్చదన కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

అలాగే ఇంటి వద్దే సేంద్రియ వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసే విధానం, వర్షపు నీటి సంరక్షణకు ఉపయోగపడే ఇంకుడు గుంత (Rainwater Harvesting Pit), మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ రూపొందించిన “వెస్ట్ టు వండర్” నమూనాలను పరిశీలించారు.

వాడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఎకో బ్రిక్స్ ద్వారా రూపొందించిన పోడియం, స్టూల్ వంటి వినూత్న నమూనాలు అధికారులను ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల జేడీ ఫౌండేషన్ నిర్వహించిన పెన్ డ్రాప్ బాక్స్ కార్యక్రమం ద్వారా సేకరించిన ఉపయోగించిన పెన్నులను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు జేడీ ఫౌండేషన్ పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ, సమాజంలో పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు.

జేడీ ఫౌండేషన్ పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ మరియు సుస్థిర జీవన విధానాల ప్రోత్సాహానికి నిరంతరం కృషి చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader