“జలమే జీవం” పోస్టర్ ఆవిష్కరణ

05-05-2026: విశాఖ మహానగరంలో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలమే జీవం” కార్యక్రమానికి మద్దతుగా నగరవాసుల్లో అవగాహన కల్పించేందుకు జేడీ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా “వర్షపు నీటిని ఒడిసి పట్టుదాం – ఇంకుడు గుంతలు నిర్మిద్దాం – భూగర్భ జలాలను పెంపొందిద్దాం” అనే సందేశాలతో రూపొందించిన అవగాహన పోస్టర్లను విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం. విశ్వేశ్వర నాయుడు గారి చేతుల మీదుగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డీఆర్‌ఓ శ్రీ ఎం. విశ్వేశ్వర నాయుడు గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మించి వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భూగర్భ జలాల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో జేడీ గ్రూప్ సభ్యులు ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ అధికారులు, జేడీ గ్రూప్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


07-05-2026: ఇంకుడు గుంతలు నిర్మిద్దాం – భూగర్భ జలాలను పెంపొందిద్దాం!

“జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా, స్థానిక 89వ వార్డుకు చెందిన శ్రీరామ్ కన్స్ట్రక్షన్ అధినేత శ్రీ యల్లపు శ్రీను గారు నిర్మిస్తున్న గ్రూప్ హౌస్‌తో పాటు వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ఈ రోజు జేడీ ఫౌండేషన్ సభ్యులు పరిశీలించారు.

వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా రూపొందించిన ఈ ఇంకుడు గుంతలు భూగర్భ జలాల పెంపుదలకు ఎంతో దోహదపడతాయని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. పెరుగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి వద్ద, ప్రతి నిర్మాణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.

వర్షపు నీటిని వృథా కాకుండా సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడుకోవచ్చని పేర్కొంటూ, “ఇంకుడు గుంతలు నిర్మిద్దాం – భూగర్భ జలాలను పెంపొందిద్దాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవగాహన కార్యక్రమాలను జేడీ ఫౌండేషన్ నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు.


08-05-2026: జలమే జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలపై అవగాహన

ఈ రోజు రుషికొండలోని క్రూయిజ్ హోటల్‌లో టెక్నాలజీ మేనేజర్, మినిస్ట్రీ ఆఫ్ ఆగ్రో & ఫార్మర్స్ డాక్టర్ జ్యోతిర్మయి గారి అధ్యక్షతన నిర్వహించిన “జలమే జీవం” ఇష్టాగోష్టి సమావేశంలో డాక్టర్ ఆదిత్య గారు వర్షపు నీటిని ఎందుకు సంరక్షించాలి, ఎలా సంరక్షించాలి అనే అంశంపై సవివరంగా అవగాహన కల్పించారు.

వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ జలాల పెంపు వంటి అంశాల ప్రాధాన్యతను వివరించి, ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రీజినల్ బయోడైవర్సిటీ కోఆర్డినేటర్ శ్రీ జానకీరావు గారు, సాఫ్ట్‌వేర్ ట్రైనర్ శ్రీ బి. కృష్ణంనాయుడు గారు, జేడీ గ్రూప్ సభ్యులు శ్రీమతి టి. మనో రమణి గారు పాల్గొన్నారు.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో “జలమే జీవం” అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జేడీ ఫౌండేషన్ నిరంతరం కార్యక్రమాలను నిర్వహిస్తూ, వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపుపై సమాజంలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader