21-01-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ వివిధ పాఠశాలల్లో యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేసి వాడేసిన పెన్నుల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. జనవరి నెలలో నిర్వహించిన రెండు ముఖ్య కార్యక్రమాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
21-01-2026: కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
స్థానిక కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 25 రోజుల క్రితం ఏర్పాటు చేసిన పెన్ డ్రాప్ బాక్స్‌లలో విద్యార్థులు బాధ్యతగా వాడేసిన పెన్నులను వేయడంతో అవి పూర్తిగా నిండాయి.
ఈ రోజు జేడీ ఫౌండేషన్ సభ్యులు పాఠశాలను సందర్శించి నిండిన బాక్స్‌లను సేకరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ఒకేచోట సేకరించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు ముందుగా అవగాహన కల్పించడం జరిగింది.
సేకరించిన పెన్నులను రీసైక్లింగ్ ప్రక్రియకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి మరియు విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు.

31-01-2026 – గోపాలపట్నం బాలికల ఉన్నత పాఠశాల
గోపాలపట్నం బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్స్‌లలో విద్యార్థినులు స్వయంగా పాఠశాల ఆవరణలో చెల్లాచెదురుగా ఉన్న వాడేసిన పెన్నులను సేకరించి బాక్స్‌లలో వేశారు.
కేవలం ఒక్క రోజులోనే సుమారు నాలుగు వందల వాడేసిన పెన్నులు సేకరించడం విశేషం. బాక్స్‌లు నిండిపోవడంతో ఉపాధ్యాయుల సమాచారం మేరకు జేడీ గ్రూప్ సభ్యులు పాఠశాలను సందర్శించి వాటిని సేకరించారు.
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థినుల చైతన్యం ప్రశంసనీయమని ఫౌండేషన్ సభ్యులు అభినందించారు.
చిన్న చర్యలే పెద్ద మార్పులకు దారితీస్తాయని ఈ కార్యక్రమాలు నిరూపిస్తున్నాయి. వాడేసిన పెన్నులను సక్రమంగా సేకరించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడమే కాకుండా విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించవచ్చు.



