22-05-2026: జె.డి. ఫౌండేషన్ అందించిన సహాయం ఒక మహిళ జీవితాన్ని ఎలా మార్చిందో తెలిపే విజయగాథ ఇది. రెండు సంవత్సరాల క్రితం మంచిర్యాలకు చెందిన ఔత్సాహిక మహిళ శ్రీమతి సంధ్యకు టైలరింగ్ మరియు డిజైనర్ వేర్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు జె.డి. ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందించింది.
ఆ సమయంలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, ఐదు కుట్టు మిషన్లతో పాటు మూడు నెలల అద్దెకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా ఫౌండేషన్ అందించింది. ఆ సహాయాన్ని సద్వినియోగం చేసుకున్న సంధ్య నేడు తన కాళ్లపై తాను నిలబడి విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించింది.
తన నెలవారీ ఆదాయంలో 25 శాతం జె.డి. ఫౌండేషన్‌కు తిరిగి అందిస్తూ, మరొక అవసరమైన వ్యక్తికి అదే విధమైన సహాయం అందేలా తన వంతు బాధ్యతను నిర్వర్తించడం విశేషం. అంతేకాకుండా, ఎంతో మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా జె.డి. ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ గారు సంధ్య మరియు ఆమె బృందాన్ని అభినందిస్తూ, ఫౌండేషన్ లక్ష్యం కేవలం సహాయం చేయడం మాత్రమే కాకుండా, లబ్ధిదారులు స్వయం ఉపాధి సాధించి మరెందరికో స్ఫూర్తిగా నిలవడమేనని పేర్కొన్నారు.



